
పిన్నాపురం (కర్నూలు జిల్లా): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికల్లో గ్రీన్ ఎనర్జీ (Green Power) కి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే రూ. లక్ష కోట్ల విలువైన గ్రీన్ పవర్ ఒప్పందాలు (MOUలు) జరిగాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పిన్నాపురం గ్రామంలో శనివారం గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందని తెలిపారు. ఇప్పటికే 2025 న్యూ ఎనర్జీ పాలసీ (New Energy Policy) ని తమ సర్కారు తీసుకొచ్చిందని చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా కొత్త మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తిని అన్వేషిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మిగులు విద్యుత్ సాధించే దిశగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.
Green Power : విద్యుత్ అవసరం – అభివృద్ధి చక్రం
ప్రతి రంగానికి విద్యుత్ అవసరం అనివార్యమైందని డిప్యూటీ సీఎం చెప్పారు. విద్యుత్ సరఫరా పెరిగితే ఉత్పత్తులు పెరుగుతాయి, దీని ద్వారా ఉపాధి కలుగుతుంది, తద్వారా రాష్ట్ర జీడీపీ వృద్ధి చెందుతుందని వివరించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రపంచమే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ (Green Power) వైపు పరుగులు పెడుతోందని గుర్తుచేశారు.
గ్రీన్‌కో ప్రాజెక్ట్ – ప్రపంచంలోనే వినూత్న ప్రణాళిక
ఈ సందర్బంగా పిన్నాపురంలో 4వేల ఎకరాల్లో రూపొందిస్తున్న గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్‌ను అభినందించారు. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే ప్రదేశంలో సోలార్ (4,000 మెగావాట్లు), విండ్ (1,000 మెగావాట్లు), పంప్డ్ హైడ్రో స్టోరేజ్ (1,680 మెగావాట్లు) కలిపి మొత్తం 6,680 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ అని వివరించారు.
ఆధునిక సాంకేతికతతో నూతన దిశ
గ్రీన్‌కో ప్రాజెక్ట్‌లో భాగంగా క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్, ఎగువ-కింది రిజర్వాయర్లు, పవర్‌హౌస్, ఆధునిక సబ్‌స్టేషన్ లాంటి మౌలిక సదుపాయాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి పరిశీలించారు. పగలులో సోలార్ విద్యుత్ స్టోరేజ్ చేసి, రాత్రివేళ వినియోగించడంలో ఈ ప్రాజెక్టు ముందంజలో ఉందన్నారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..