
Rythu Nestam | హైదరాబాద్ : వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 16న జరగనున్న రైతునేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతులతో ముఖాముఖి మాట్లాడతారని, ఆ ప్రసారాన్ని అన్ని రైతునేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని కలెక్టర్లకు తెలిపారు. ప్రతినిధులను ఆహ్వానించి, ప్రతి ప్రాంతం నుంచి కనీసం 250 మంది రైతులు హాజరయ్యేలా చూసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లను కోరారు.
మరో 1000 కేంద్రాల్లో అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్
ఈ కార్యక్రమం (Rythu Nestam) ద్వారా రైతులు వ్యవసాయ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సీఎస్ రామకృష్ణా రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు 500 కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని విస్తరించనున్నామని తెలిపారు. ఈనెల 16 నుండి అదనంగా మరో 1000 కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదుపాయం ద్వారా నిపుణులు ఏ పంటలు వేసుకోవాలి, ఆధునిక సాగు విధానాల గురించి రైతులకు తరచూ సూచనలు ఇస్తారని చెప్పారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కోసం ప్రతి రైతునేస్తం కేంద్రంలో సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు మండల స్థాయి అధికారిని నియమించాలని కలెక్టర్లను కోరారు. కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన సూచించారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..